ఆర్టికల్ 370 అంటే ఏంటి? కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన ఈ ఆర్టికల్ రద్దు సాధ్యమేనా?

ఫిబ్రవరి 14న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.


ఈ దాడి గురించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆర్టికల్ 370' గురించి మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.


సోమవారం (ఫిబ్రవరి 18) విదేశాంగ సహాయ మంత్రి, మాజీ సైనిక చీఫ్ జనరల్ వీకే సింగ్ "జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలి" అన్నారు.


కానీ దానికి ముందు మనం అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఎందుకు?, అది ఇంత వివాదాస్పదం ఎందుకవుతోంది?. జమ్ము-కశ్మీర్‌ కోసం రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుంది.



ఆర్టికల్ 370 ఎలా ఉనికిలోకి వచ్చింది


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను ఇస్తుంది.


1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు.


ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.


జమ్ము-కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ వచ్చింది.


1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది.