నల్గొండ: పాస్ పుస్తకాలు లేకుండానే తమ భూమిని వేరేవారి పేరుమీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన ఓ కుటుంబం సబ్ రిజిస్ట్రార్ ను నిలదీశారు. ఈ సంఘటన మంగళవారం గుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన బైరా ఎల్లయ్య, సిద్దమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు వెంకటేష్ ఇటీవల మరణించాడు. దీంతో పెద్ద కోడలు యాదమ్మ పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. ఎల్లయ్యకు గ్రామంలోని 267, 268, 269 సర్వేనంబర్లలో 4ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పంచాలని వృద్ధులైన ఎల్లయ్య?సిద్దమ్మ దంపతులను పెద్ద కోడలు అడగడంతో చిన్న కుమారుడు సిద్దులుతో పాటు సమానంగా పంచి, మిగిలిన భూమిని తాము, ఆడ పిల్లలకు ఇస్తానని చెప్పారు. గతనెల రోజుల క్రితం వృదుడైన ఎల్లయ్యను కోడలు యాదమ్మ హైదరాబాద్ కు తీసుకెళ్లింది. గత శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి తీసుకొచ్చింది. అక్కడ అతడి దగ్గర ఉన్న జీరాక్స్ భూమి పత్రాలను తీసుకొని, సబ్ రిజి న్ వద్ద ఓ డ్యాక్యుమెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసింది. అనంతరం కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో 4.9 ఎకరాల్లో 2.5ఎకరాల భూమిని యాదమ్మ తన పేరున చేసుకుంది. ఇది తెలుసుకున్న ఎల్లయ్య భార్య సిద్దమ్మ, బిడ్డలు కనకమ్మ, రజిత, అనితలు అదే రోజు సాయంత్రం అధికారుల వద్దకు వచ్చి యాదమ్మ జీరాక్స్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని పెండింగ్లో పెట్టాలని, 4,9 ఎకరాలకు సంబంధించిన ఒరిజినల్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడీలు తమ వద్ద ఉన్నాయని వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్న మరో సారి ఎల్లయ్య భార్య, కుమార్తెలు కార్యాలయానికి వచ్చి జీరాక్స్ పేపర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని, మీరు ఎంత లంచం తీసుకున్నారని, కార్యాలయంలో పని చేసే నవీన్ అనే వ్యక్తీ డాక్యుమెంట్ దగ్గరుండి తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల వద్ద సమాచారం సేకరించి శాంతిపజేశారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ | శ్రీనివాస్ వివరణ అడగగా.. ఎల్లయ్య పెద్ద కొడలు యాదమ్మ గత శనివారం సర్వే నంబర్ 267, 268, 269లో ఉన్న 4.9 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ తీసుకువచ్చారని, అందులో జీరాక్స్ ఉన్న విషయాన్ని అంతగా గమనించలేదన్నారు. ఈ విషయమై ఎల్లయ్య భార్య సిద్దమ్మ, ముగ్గురు కూతుర్లు వచ్చారు. జిరాక్స్ పత్రాలతో, తమ నాన్నను మోసం చేసి యాదమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని నిలిపివేయాలని వినతి ఇచ్చారు. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నామని, | ఈ విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
పాసుబుక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్